Thursday, January 13, 2011

మన హీరోలు పరీక్ష రాయటానికి వచ్చారు

మన హీరోలు పరీక్ష రాయటానికి వచ్చారు . వచ్చి ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించారు .

పరిక్ష మొదలైన 10 నిమిషాల తరువాత వచ్చాడు మహేష్ బాబు. ఏంటి బాబు లేట్ అంటే ..

* మహేష్ :* ఎప్పుడు వచ్చామని కాదు అన్నయ్య పరీక్ష రాశామా లేదా ..? అని వెళ్ళి కూర్చున్నాడు .
( వెనకున్న చిరంజీవి బ్రదర్ ఇది తీసుకో అని స్లిప్ ఇచ్చాడు మహేష్ థాంక్స్ చెబితే )

* చీరంజీవి :* థాంక్స్ కాదు బ్రదర్ ఆ స్లిప్ ను మూడు చేసి ముగ్గురికి ఇవ్వు , ఆ ముగ్గురుని ఇంకో ముగ్గురకు ఇవ్వమని చెప్పు అలా మొత్తం స్లిప్ లు మయం చేయండి .

( అనగానే పక్కనే వున్న రామ్ చరణ్ అందుకుని )
* రామ్ చరణ్ : * ఒక్కొకటి కాదు నాన్న , వంద స్లిప్పులు ఒక్కసారి పంపించు 300 వందలమందికి పంచుతా .. ( అని కూర్చున్నాడు . అప్పుడు సాయికుమార్ వచ్చి )

* సాయికుమార్ : * కనిపించే మూడు పేపర్లు .. OMR పేపర్ , క్వశ్చన్ పేపర్ , ఆన్సర్ పేపర్ అయితే కనిపించని ఆ నాలుగో పేపరేరా స్లిప్ ... స్లిప్ ... స్లిప్ . ( అని తన స్లిప్ తను తీసుకుని కూర్చున్నాడు .)

స్లిప్ప్పులు ఎక్కువై కోపం వచ్చిన బాలకృష్ణ
* బాలకృష్ణ :* ఒరేయ్ .. నేను కాపీ కొట్టడం మొదలుపెడితే .... ఏ ప్రశ్నకి ఏ జవాబు రాసానో కనుక్కోవడానికి వారం పట్టిద్ది . మర్యాదగా ఏ ప్రశ్నకు ఏ స్లిప్పో సరిగ్గా చెప్పండి .

మరోపక్క స్లిప్పులు దొరక్క ఎగబడుతున్న వాళ్ళను పక్కకు నెట్టిన ప్రభాస్
* ప్రభాస్ : * వాడు పొతే వీడు , వీడు పొతే నేను , నేను పొతే నా అమ్మామొగుడు అని ఎవరైనా స్లిప్ కోసం ఎగబడితే ... దెబ్బకో తలకాయ్ చొప్పున బెంచిలకి బలవుతాయి అని స్లిప్పు తెచ్చుకు రాసుకుంటున్నాడు .

యన్ . టి . ఆర్ బుద్దిగా తన స్లిప్పు తను రాసుకుంటుంటే ఎవడో వచ్చి స్లిప్పు లాక్కోబోతే వాడి చెయ్యి గట్టిగా పట్టుకుని
* జూ || యన్ . టి . ఆర్ : * రేయ్ ... సాఫ్ట్ గా లవర్ బాయ్ లాగా ఉన్నాడు అనుకుంటూన్నవేమో ... లోపల ఒరిజినల్ అలాగే ఉంది . స్లిప్పు వదల్లేదో ..... రచ్చ .. రచ్చే ..! అన్నాడు .

ఈ లోపు ఎగ్జామ్ స్క్వాడ్ వచ్చి పేపర్లు లాక్కుని అందరినీ బయటకు పంపారు . ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారా ... అని అందరు ఆలోచిస్తుంటే , అందరికన్నా చివరన వచ్చాడు రవితేజ )

* రవితేజ : * ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారా .. అనేగా మీ డవుటు .... నేనే ... ఇచ్చా ...! ఊరికినే కాపీ కొడితే .... కిక్ ఏముంది నా అప్పడం . అందుకే స్క్వాడ్ ను పిలిచా ..! అని అక్కడి నుండి పరిగెత్తాడు .

పట్టుకోవడానికి రవితేజ వెనకాల పడ్డారు మిగిలిన అందరు ..

Source: Forward e-mail.

Sunday, June 20, 2010

ఫాదర్స్ డే

ఈ రోజు జీవితంలో మొదటిసారిగా "ఫాదర్స్ డే"కి శుభాకాంక్షలు అందుకున్నాను. పొద్దున్న లేవగానే మా పాప తను స్వయంగా చేసిన గిఫ్ట్ కార్డ్ నాకు ఇచ్చి ఒక పెద్ద సర్ప్రయిస్ ఇచ్చింది.




Friday, April 16, 2010

మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా?


మన అందరికి తెలుసు Twitter ఎంత ప్రాచుర్యం పొందిందో.. నేను చాలా సార్లు వార్తల్లో చదివాను ఈ సైట్ ఎక్కువ లోడ్ ని తట్టుకోలేక క్రాష్ అయింది అని కాని నాకు ఈరోజు మొదటిసారిగా ఆ అనుభవం ఎదురయింది. ఈ రోజు పొద్దున్న Albuquerque విమానాశ్రయంలో నే ఎక్కాల్సిన విమానం కోసం ఎదురు చూస్తూ సమయం ఉంది కదా అని twitter లో లాగిన్ అయ్యేసరికి సైట్ డౌన్ అని కనపడింది.

Friday, February 05, 2010

తెలంగాణా వచ్చాక

తెలంగాణా వచ్చాక మన సినిమాలు...
౧. నరసింహ నాయుడు - నర్సింగ్ యాదవ్.
౨. పరుగు - ఉరుకు
౩. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి - గాడ పోరి గీడ పోరడు
౪. సిద్దు ఫ్రం శ్రీకాకుళం - మల్లేష్ ఫ్రం మల్కాజిగిరి
౫. చాలా బాగుంది - జాబర్దస్తుంది
౬. అవునన్నా కాదన్నా - ఔ మల్ల లే మల్ల
౭. సంక్రాంతి - బోనాలు
౮. అమ్మాయిలు అబ్బాయిలు - పోరిలు పోరగాల్లు
౯. పల్నాటి బ్రహ్మనాయుడు - కరీంనగర్ KCR
౧౦. నారి నారి నడుమ మురారి - పోరి పోరి నడుమ తివారి
౧౧. చంటబ్బాయి - చిన్న పోరడు
౧౨. పులి - షేర్
౧౩. ౪౭ రోజులు - ౪౭ దినాలు
౧౪. మా నాన్నకు పెళ్లి - మా అయ్యకు లగ్గం
౧౫. ఇడియట్ - దేడ్ దిమాక్ గాడు
౧౬. వరుడు - పెండ్లి కొడుకు
౧౭. పోకిరి - ఫాల్తు బాడ్కావ్
౧౮. మరణ మృదంగం - సావు డప్పు
౧౯. హ్యాపీ డేస్ - కుషి దినాలు
౨౦. ఆవిడా మా ఆవిడే - గామే భి నా పెండ్లామె

Wednesday, August 05, 2009

'మగధీర' కష్టాలు

పైన టపా శీర్షిక చూసి ఆ సినిమాలో హీరో పడ్డ కష్టాల గురించి నేనేదో వ్రాస్తున్నానని కాదు. ఆ సినిమా చూడడానికి మేము పడ్డ కష్టాల గురించి ఈ టపా.
అసలు నాకు మొదటి నుంచి కూడా సినిమాలంటే ఆసక్తి ఉంది కాని పిచ్చి మాత్రం లేదు. బాగా క్రేజ్ ఉన్న సినిమాని మొదటిరోజే, వీలుయితే మొదటి ఆటే చూడాలని వేలం వెర్రిగా ఎగబడే టైపు కాదు. పైగా ఒకప్పుడు పెద్దగా కష్టపడకుండా టికెట్స్ దొరికాయని కేవలం రెండంటే రెండే సినిమాలు మొదటి రోజే చూడడం, అవి కాస్తా మన 'లెగ్' మహత్యమో ఏమో కాని బాక్సాఫీసు వద్ద బొక్కాబోర్లా పడ్డాయి. అంచేత అప్పటి నుంచి సిని నిర్మాతల శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకొని అప్పటి నుంచి 'మొదటి రోజు ఆట' మానుకున్నాను.
ఇక పొతే ఈ మగధీర సినిమా విషయానికొస్తే, చిత్రం షూటింగ్ జరిగినన్నాల్లు మీడియాలో వచ్చిన కథనాలు చదివి ఈ సినిమాని మొదటి రోజు కాకున్నా తొందరగానే చూడాలని నిశ్చయించుకున్నాను. సినిమా విడుదల అయ్యాక ఇంకా అన్ని సైట్లలో సమీక్షలన్నీ అదరగొట్టే లెవెల్లో ఉండడం చేత ఇంక వెంటనే రంగంలోకి దిగి, ఇద్దరు స్నేహితులను వాళ్ళ కుటుంబాలతో సహా పోగేసి రెండో రోజు మధ్యాన్నం ఆటకి టికెట్స్ బుక్ చేసాము.
ఇక్కడ న్యూజెర్సీలో మేము ఉండే ఏరియాలో థియేటరులు అంతగా బాగుండవు. మా ఇంటికి ఒక ౩ మైళ్ళ దూరములో ఓక్ ట్రి లో ఒక థియేటర్ ఉంది. సాదారణంగా మేము సినిమాలన్నీ అందులోనే చూస్తాము. టికెట్స్ ఈజీగా దొరుకుతాయి. పైగా ఇంటికి చాల దగ్గర, పక్కనే మంచి రెస్టారెంట్లు. హాయిగా తినేసి చక్కగా హాల్లోకి వెళ్ళొచ్చు. కాకపోతే థియేటర్ మాత్రం డొక్కు. అందుకని మా ఇంటికి ఒక ౩౦ మైళ్ళ దూరంలోని ఈస్ట్ విన్డుసార్లోని మల్టిప్లెక్స్ లో ఈ సినిమాకి టికెట్స్ తీసుకున్నాము.
ఇక శనివారం పొద్దున్న తీరిగ్గా లేచి పనులన్నీ చేసుకొని, లంచ్ అయ్యాక రెండు కార్లలో మొత్తం ఆరుగురం సరిగ్గా రెండు గంటలకు బయలు దేరాము. సినిమా ఏమో 3.15 కి. మాములుగా ఐతే 30 నిమిషాలలో అక్కడకి వెళ్ళొచ్చు. కాస్తా ముందుగా వెళ్లి, తీరిగ్గా బండి పార్క్ చేసుకొని, మంచి సీట్లో కూర్చొని(ఎందుకంటే ఇక్కడ మాకు టికెట్స్ మీద సీట్ నెంబర్లు ఉండవు, ఎవరు ముందుగా వస్తే వాళ్లకు మంచి సీట్) సినిమా చూద్దామని అనుకున్నాము.
మాములుగా నేను ఎప్పుడు మా ఇంటి నుంచి అటు వైపు వెళ్ళడానికి రూటు 1 తీసుకుంటాను. కాకపోతే ఆ రోజు నా GPS మాత్రం న్యూజెర్సీ టర్న్ పైక్ మీదుగా తీసుకెళ్ళింది. సరే అలా ఐతే టోల్ రోడ్ కాబట్టి తొందరగా వెళ్ళొచ్చు అని అనుకున్నాను. ఒక పది నిమిషాలు చక్కగా వెళ్ళగానే ఇంక ట్రాఫిక్ జాం మొదలయ్యింది. ఇంక అందులో ఇరుక్కుంటే ముందుకు వేల్లలేము, వెనక్కు రాలేము, పక్కకు జరగలేము. ఆరోజు మా అద్రుష్టం పడిశం పట్టినట్టు పట్టడముతో ఎక్కడి ట్రాఫిక్ అక్కడే ఆగిపోయింది. ఒక పక్క సమయం కావస్తుంది. ఇంక ఆ ట్రాఫిక్ లోనే అలా అలా మెల్లిగా వెళ్లి తర్వాత వచ్చిన ఎక్జిట్ తీసుకొని లోకల్ రోడ్ మీదుగా వెళ్ళేసరికి పుణ్య కాలం కాస్తా అయ్యి సరిగ్గా 4 గంటలకు హాల్లోకి వెళ్ళాము. వెళ్ళేసరికి తెర ముందున్న మొదటి వరుస తప్ప అన్ని సీట్లు నిండిపోయాయి. జీవితములో అలా మొదటి సారిగా ముందు వరుస లో కూర్చొని సినిమా చూసాక తలనొప్పి, మెడ నొప్పి, నడుము నొప్పి పట్టుకున్నాయి. పైగా సినిమా చూసిన ఆనందం అసలు లేకుండా పోయింది. సో కనీసం వచ్చే వీకెండ్ ఆయినా మంచిగా మొదటినుంచి సినిమా చూడాలని అనుకుంటున్నా.

Wednesday, June 17, 2009

సంస్కారం

సుమారు ఒక సంవత్సరం క్రితం జరిగింది ఈ సంఘటన.

అవి నేను న్యూజెర్సీ లోని ప్లేయిన్సుబోరో అనే ప్రాంతంలో ఉంటూ న్యూయార్క్ లో పని చేస్తున్న రోజులు.ప్రతి రోజు ఇంటి నుండి ఆఫీసుకి బస్సులో వెళ్లి వస్తుండే వాడిని. రోజు ఉదయం మా ఇంటి ముందు బస్ ఎక్కితే న్యూయార్క్ లోని "పోర్ట్ ఆథారిటి"లో దిగే వాడిని. మరల సాయంత్రం అక్కడ బస్ ఎక్కితే ఇంటి ముందు దిగేవాడిని.

ఇక్కడ మన దగ్గరలాగ బస్ నిండా జనం ఎక్కుదామంటే కుదరదు. సరిగ్గా బస్సులో ఎన్ని ఐతే సీట్లు ఉంటాయో సరిగ్గా అంత మందినే అనుమతిస్తారు. పైగా మా రూట్లో రోజుకు కేవలం ౪ అంటే ౪ బస్సులే ఉండేవి. మనం సరిగ్గా సమయానికి బస్సు స్టాప్ కి వచ్చినా కూడా మనం బస్సు ఎక్కుతామో లేదో అని సందేహముగా ఉండేది. సరిగ్గా నా దగ్గరకి లేదా ఒకరిద్దరు నా ముందు ఉండగానే సీట్లు అయిపోయాయని డ్రైవర్ బస్సు తలుపు మూసివేసిన సంఘటనలు కూడా ఉన్నాయి నా అనుభవములో. మనం సమయానికి వచ్చినా కూడా బస్ దొరక్కపోతే మహా చిరాగ్గా ఉండేది.

నేను ఎక్కాల్సిన బస్ అక్కడ 416 గేట్లో వచ్చేది. అదే గేట్లో మా రూట్ బస్ కాకుండా ఇంకో వేరే రూట్ బస్ కూడా వచ్చేది. నా బస్ సాయంత్రం 5:30 కి అయితే వేరే బస్ 5:40 కో 5:45 కో ఉండేది. రెండు బస్సుల జనం ఒకటే లైనులో నిలబడేవారు. ఎవరి బస్సు వస్తే వారు ఆ లైనులో ముందుకు వెళ్లి బస్ ఎక్కేవాళ్ళు. మిగతావారు అలాగే తర్వాతి బస్సుకి ఎదురుచూసేవారు.

ఆ రోజు నేను 5:30 కి బస్సు ఎక్కుదామని వచ్చాను కాని దురద్రుశ్టావశాత్తు సరిగ్గా నా ముందున్న అతను ఎక్కగానే సీట్లు అయిపోయాయి. అప్పుడు డ్రైవర్ అన్నయ్య నన్ను జాలిగ ఒక చూపు చూసి బై చెప్పి వెళ్లి పోయాడు. ఇంకా చేసేదేమీ లేక అలాగే అదే లైనులో నిల్చున్నాను. ఇంకా నా వెనకాల చాల మంది తర్వాతి వేరే రూట్ బస్సు వాళ్ళు ఉన్నారు. పది నిమిషాలు అయ్యాక ఆ బస్సు రాగానే ఇంకా అందరు వరుసగా ఎక్కేసాకా నేను ఒక్కడినే అలాగే బయట లైనులో నిల్చున్నాను నా బస్సు కోసం ఎదురుచూస్తూ.ఇంకా ఆ బస్సు కూడా బయలు దేరడానికి సిద్దంగా ఉంది. డ్రైవరు కూడా ఇంక తలుపు మూసేసాడు. ఇంక ఆ బస్సు వెళ్ళిపోతే మళ్ళీ ఆ రూట్ బస్సు 30 నిమిషాల తర్వాతే...

సరిగ్గా అప్పుడు సుమారు 50 ఏళ్ళు ఉన్న ఒక అమెరికన్ భుజాన పెద్ద సంచితో బస్సు ఎక్కడానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. నేనేమో కొంచం పక్కన నిలబడి నా బస్సు కోసం ఎదురు చూస్తున్నాను. లైనులో ఎవరు లేకపోవడం, బస్సు ఆల్రెడీ స్టార్ట్ అవటముతో అతను డైరెక్ట్ గా గేట్ తెరుచుకొని బస్ ఎక్కడానికి లోనికి వెళ్ళాడు. గేట్ తెరుచుకొని లోపలికెళ్ళి సరిగ్గా బస్ ఎక్కే సమయానికి అతనికి నేను కనపడ్డాను. అంతే వెంటనే బయటకు వచ్చి "అయాం సారి, మీరు లైనులో ఉన్నారా" అని అడిగాడు. నాకైతే ఒక్క క్షణం ఆశ్చర్యం వేసింది. "లేదండి, నేను వేరే బస్ కోసం ఎదురుచూస్తున్నా" అని చెప్పటముతో కృతఙ్ఞతలు చెప్పి అతను వెళ్లి బస్సులో కూర్చున్నాడు.

నాకైతే నిజంగా అప్పుడు భలే ముచ్చటేసింది. అంత కష్టపడి పరిగెత్తుకుంటూ, ఆయాసముతో వచ్చి కూడా, బస్సు బయలుదేరడానికి సిద్ధంగా ఉందని తెలిసి కూడా, పైగా తర్వాతి బస్సు మళ్ళా అరగంట వరకు లేదని తెలిసి కూడా నన్ను చూసి నేను లైనులో ఉన్నానేమో అని బయటకి వచ్చి నన్ను అడిగాడంటే అతని పద్ధతికి, సంస్కారానికి నాకు భలే ఆశ్చర్యం, ఆనందం ఇలా అన్ని అనుభూతులు ఒకేసారి కలిగాయి. అప్పుడు నాకు మన వాళ్ళు మన దేశములో బస్సు స్తాండుల్లో, రైల్వే స్తేషాన్లల్లో చేసే హడావుడి, తొక్కిసలాట, పక్క వాడిని తోసేసి ఎక్కే విధానం అన్ని గుర్తుకు వచ్చాయి. బాధపడాల్సిన విషయం ఏంటంటే ఎలాగు అందరికి చోటు దొరుకుతుందని తెలిసిన కూడా, ఆడవాళ్ళూ, పిల్లలు, వృద్దులు ఉన్నాకూడా మన వాళ్ళు అంత ఓపికగా, చక్కగా వరుసలో నిల్చొని వెళ్ళడం చాల అరుదు.